మెదక్ జిల్లాలో వరద ప్రాంతాల్లో పర్యటించిన ఆరోగ్య మంత్రి రాజనర్సింహ
మెదక్, ఆగస్టు 28: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మెదక్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను మంగళవారం సందర్శించారు. వరద బాధితులను పరామర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా రామాయంపేట జలదిగ్బంధంలో చిక్కుకుపోయిందని మంత్రి తెలిపారు. వరదలలో చిక్కుకున్న 60 మందిని రెవెన్యూ, పోలీసులు, డిజాస్టర్ మేనేజ్మెంట్, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కాపాడారని వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులు గల్లంతవగా, వారిలో ఒకరి మృతదేహం లభించిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో ఉందని మంత్రి స్పష్టం చేశారు.
రామాయంపేటలోని బీసీ కాలనీతో పాటు నీట మునిగిన ప్రాంతాలను మంత్రి రాజనర్సింహ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో కలిసి పరిశీలించారు. బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వారికి నిత్యావసర సరుకులు, భోజనం, బట్టలు, బెడ్ షీట్లు అందించాలంటూ అధికారులను ఆదేశించారు.
నిజాంపేట, మల్క చెరువు, కోనాపుర్, నందిగామ రోడ్డులో దెబ్బతిన్న బ్రిడ్జిలను, సాయి చెరువు అలుగులను మంత్రి పరిశీలించారు. వచ్చే రెండు మూడు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని సూచించారు.
భారీ వర్షాల ధాటికి పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లు, రోడ్లను పరిశీలించిన మంత్రి, త్వరలో పునరుద్ధరణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పంటనష్టం, ఆస్తి నష్టంపై రెవెన్యూ అధికారులు అంచనాలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు.
రామాయంపేట, కామారెడ్డి, మెదక్ పరిసర మండలాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. గత 50 ఏళ్లలో ఇంతటి భారీ వర్షాలు చూడలేదని స్థానికులు మంత్రికి తెలిపారు. ప్రజలకు పూర్తి అండగా ప్రభుత్వం ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తుందని మంత్రి రాజనర్సింహ భరోసా ఇచ్చారు.

Post a Comment