వరంగల్ బహిరంగ సభ విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ
కరీంనగర్, ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని, ఆదివాసీ హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ కోర్ట్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.
ఈ సందర్భంగా మధ్య భారతదేశంలో జరుగుతున్న ఆదివాసీల హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తూ వెంటనే పోలీస్ క్యాంపులు ఎత్తివేయాలని, కాల్పుల విరమణ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును ఎవరు కాలరాయకూడదని స్పష్టం చేశారు.
1/70 యాక్ట్, అటవీ హక్కుల పరిరక్షణ చట్టం, పెసా చట్టం, గ్రామసభ తీర్మానాలు పూర్తిగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈ దేశ సంపద కొంతమంది కార్పొరేట్లకే కాకుండా ప్రజలందరిదని గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో ఆగస్టు 24న వరంగల్ హనుమకొండలోని అంబేద్కర్ భవన్‌లో జరగనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఆ సభలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, ఆదివాసీ హక్కుల కార్యకర్తలు సోనీ సోరి, బేలబాటియా, రమణా లక్ష్మయ్య, గోడెం గణేష్, అలాగే పౌరహక్కుల సంఘాల నాయకులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ నారాయణరావు, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ డి. నరసింహారెడ్డి, ప్రొఫెసర్ కె. వెంకట్ నారాయణ (రిటైర్డ్), కే ఎన్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భూర అభినవ్, అలాగే వామపక్ష పార్టీ నేతలు జాన్ వెస్లీ, చలపతిరావు, కూనమునేని సాంబశివరావు, పోటు రంగారావు, మల్లేపల్లి ప్రభాకర్, కె. విశ్వనాథ్ తదితరులు పాల్గొననున్నారు.
ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులు, కర్షకులు, కార్మికులు, మహిళా–దళిత సంఘాలు అందరూ ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో–కన్వీనర్ మార్వాడి సుదర్శన్, కరీంనగర్ జిల్లా కో–కన్వీనర్ బాలసాని రాజయ్య, ఉమ్మడి జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు నారా వినోద్, జిల్లా కో–కన్వీనర్ జిందం ప్రసాద్, మహిళా విభాగం నాయకురాలు భారతి నాయక్, భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షుడు వాసాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment