రాహుల్ గాంధీ యాత్రకు మద్దతుగా బీహార్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన *“ఓటర్ అధికార్ యాత్ర”*కు సంఘీభావం తెలుపుతూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ నుండి బీహార్ బయలుదేరుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని బలపరచడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ మహా యాత్రకు తెలంగాణ నుండి పెద్ద ఎత్తున మద్దతు లభించడం విశేషం.
రేవంత్ రెడ్డితో పాటు పలువురు కేబినెట్ మంత్రులు కూడా బీహార్ పర్యటనకు వెళ్ళనున్నారు. ఈ బృందంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి సీతక్క, మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. ఈ నేతలందరూ రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రలో పాల్గొని ఐకమత్యాన్ని చాటనున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ స్థాయి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, పార్టీ హైకమాండ్ పట్ల తన కట్టుబాటు మరోసారి స్పష్టంచేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాహుల్ గాంధీ యాత్రలో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ ముఖ్య నేతలు బీహార్ చేరుకుని ర్యాలీలలో పాల్గొన్నారు. నేడు రేవంత్ రెడ్డి బృందం కూడా రాహుల్ వెంట నడవడం పార్టీ జాతీయ సమైక్యతకు సంకేతంగా భావిస్తున్నారు.
కాంగ్రెస్ శ్రేణులు అయితే, “రాహుల్ గాంధీ యాత్ర దేశంలో ప్రజాస్వామ్య రక్షణకు నాంది అవుతుందని, తెలంగాణ సీఎం బృందం బీహార్ పర్యటన మరింత బలాన్నిస్తుందని” ఉత్సాహంగా చెబుతున్నారు.
Post a Comment