ఏపీలో మళ్లీ అర్ధరాత్రి 2.22 గంటలకు భూకంపం.. ప్రజల్లో ఆందోళన!
అమరావతి: సెప్టెంబర్ 24: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి 2.22 గంటలకు స్వల్పంగా భూమి కంపించడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.
ఒంగోలు నగరంలోని విజయ్‌నగర్ కాలనీ, గాయత్రీనగర్, వడ్డేపాలెం, భాగ్యనగర్, శ్రీరామపురం, సీఎస్ఆర్ శర్మ కళాశాల పరిసర ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం. కంపనలు గమనించిన వెంటనే కొందరు ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
ఇదే జిల్లాలో గతంలోనూ పలుమార్లు ఇలాంటి ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ఏడాది మే నెలలో పొదిలి, దర్శి, మండ్లమూరు మండలాల్లో కూడా రెండు సెకన్లపాటు భూమి కంపించింది. ఆ సమయంలోనూ ప్రజలు భయంతో ఇళ్ల బయటకు పరుగులు తీశారు.
అలాగే, గతేడాది డిసెంబర్‌లో దర్శి నియోజకవర్గంలోని గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో వరుసగా నాలుగు రోజులపాటు భూ ప్రకంపనలు సంభవించాయి. భూగర్భంలో జరిగిన మార్పులే ఇందుకు కారణమని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) శాస్త్రవేత్తలు గుర్తించారు.
శాస్త్రవేత్తల ప్రకారం, భూగర్భంలో చిన్నచిన్న కదలికలు వచ్చినప్పుడు ఇలాంటి స్వల్ప భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. తాజా ప్రకంపనలపై మరింత సమాచారం కోసం సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు.
Post a Comment