ఈనెల 29న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల?

ఈనెల 29న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల?


హైదరాబాద్ : సెప్టెంబర్ 24 : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు వేగం వచ్చింది. గ్రామపంచాయతీలు, మండల పరిధిలో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తయింది. మండల పరిధిలోని ఎంపీటీసీలు, సర్పంచ్ పోస్టుల రిజర్వేషన్లను ఆర్డీవోలు పూర్తి చేయగా.. గ్రామాల్లోని వార్డుల రిజర్వేషన్లను ఎంపీడీవోలు ఖరారు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాల మేరకు జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులు ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు.

ఎన్నికల నిర్వహణ విషయంలో దశల వారీగా పోలింగ్ జరపాలన్న ప్రతిపాదనలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి చేరాయి. ఒకే దశలో ఎన్నికలు జరపాలంటే భారీ సంఖ్యలో పోలీసు బలగాలు, పోలింగ్ సిబ్బంది అవసరమవుతారని.. తమ వద్ద ఆ స్థాయిలో సిబ్బంది లేరని కలెక్టర్లు నివేదించారు. అందువల్ల ఎక్కువ జిల్లాల కలెక్టర్లు రెండు లేదా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. చిన్న జిల్లాల కలెక్టర్లు రెండు విడతల్లో ఎలక్షన్స్ జరపాలని కోరగా, సమస్యాత్మక గ్రామాలు, మండలాలు ఎక్కువగా ఉన్న జిల్లాల అధికారులు మాత్రం మూడు విడతల్లో ఎన్నికలు జరపాలని నివేదించారు.

బీసీ రిజర్వేషన్ల శాతం 42కి పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఆధారంగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి అయింది. అయితే జాబితాను అధికారికంగా ఇంకా గోప్యంగా ఉంచారు. పంచాయతీరాజ్ శాఖ బుధవారం లేదా గురువారం రిజర్వేషన్ల తుది జాబితాను విడుదల చేసే అవకాశముంది.

ఈ క్రమంలో ఎన్నికల కమిషన్‌తో మరోసారి ప్రభుత్వం సంప్రదించి, ఎన్నికలను ఎన్ని విడతల్లో నిర్వహించాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకోనుంది. అన్ని అనుకున్నట్టే జరిగితే ఈనెల 29న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం సూచనల ప్రకారం, అక్టోబర్ రెండో వారంలో తొలి విడత నోటిఫికేషన్ జారీ చేసి.. నవంబర్ 10లోపు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని పూర్తిచేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.