దసరా కానుకగా ఇందిరమ్మ చీరలు – ఈ నెల 23 నుంచి పంపిణీ
హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు శుభాకాంక్షలతో ప్రత్యేక కానుకగా ఇందిరమ్మ చీరల పంపిణీను ప్రారంభించనుంది. ఈ నెల 23వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
మహిళల స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఉచితంగా చీరలు అందించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకేసారి ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల్లో చీరల పంపిణీలో పాల్గొననున్నారు.
ఇప్పటికే 50 లక్షల చీరల తయారీ పూర్తి కాగా, మరో 10 లక్షల చీరలు ప్రాసెసింగ్ దశలో ఉన్నాయని సమాచారం. మొత్తం 60 లక్షల చీరలు పంపిణీకి సిద్ధం అవుతుండగా, ఒక్కో చీర తయారీకి సుమారు ₹800 వరకు వ్యయం అయినట్లు అధికారులు పేర్కొన్నారు.
దసరా పండుగ ఉత్సాహంలో భాగంగా అందించే ఈ చీరలు లక్షలాది కుటుంబాలకు ఆనందాన్ని కలిగిస్తాయని ప్రభుత్వం నమ్మకంగా చూస్తోంది. ఈసారి పంపిణీ మరింత పారదర్శకంగా, సమగ్రమైన విధానంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Post a Comment