కరూర్‌లో తొక్కిసలాట ఘోరం 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషాదం
కరూర్ (తమిళనాడు), సెప్టెంబర్ 28: తమిళనాడులోని కరూర్‌లో జరిగిన టీవీకే అధినేత విజయ్ ర్యాలీ ఘోర విషాదంగా మారింది. సభా ప్రాంగణంలో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకోవడంతో 38 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 10 మంది చిన్నారులు, 18 మంది మహిళలు ఉండటం హృదయ విదారకంగా మారింది. మరో 46 మందికిపైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
విజయ్ ప్రసంగిస్తుండగా భారీగా తరలివచ్చిన అభిమానులను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. ఉక్కపోత, ఊపిరాడక తల్లడిల్లిన పలువురు స్పృహ కోల్పోయారు. పరిస్థితి గమనించిన విజయ్ ప్రసంగం ఆపేసి స్వయంగా నీళ్ల బాటిళ్లు అందజేయడం ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. కాసేపట్లోనే తీవ్ర తొక్కిసలాట జరిగి పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది.
విజయ్ దిగ్భ్రాంతి
"నా హృదయం ముక్కలైంది. ఈ బాధ భరించలేనిది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి" అంటూ విజయ్ ట్వీట్ చేశారు.
సీఎం స్టాలిన్ సానుభూతి – సహాయం ప్రకటింపు
ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ₹10 లక్షలు, గాయపడిన వారికి ₹1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను స్వయంగా పరామర్శించారు.
విచారణ కమిటీ
ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం, రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ర్యాలీ నిర్వాహకుల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Post a Comment