తెలంగాణలో ఇక కుల ధ్రువీకరణ పత్రాల జారీ సులభతరం

ప్రతి సంవత్సరం 20 లక్షల మందికి లబ్ధి – మీ సేవలో కొత్త విధానం


హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలకు కుల ధ్రువీకరణ పత్రాల జారీ ఇక మరింత సులభంగా మారింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పౌరులు ఇప్పుడు మీ సేవ కేంద్రాల్లోనే నేరుగా ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు. ప్రత్యేక కేసులు మినహా ఇకపై తహసీల్దార్‌ ఆమోదం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా మార్పులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

గతంలో ప్రతి దరఖాస్తు తహసీల్దార్‌ అనుమతి కోసం వెళ్లడంతో ఆలస్యం జరుగుతుండేది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచనలతో మీ సేవ విభాగం చర్యలు తీసుకుంది. సీసీఎల్‌ఏ, బీసీ సంక్షేమ, ఎస్సీ సంక్షేమ శాఖలు, జిల్లా అధికారులు, తహసీల్దార్లతో పలు సమావేశాల అనంతరం కొత్త విధానం అమల్లోకి వచ్చింది.

ప్రయోగాత్మకంగా 15 రోజుల క్రితం ప్రారంభమైన ఈ సదుపాయం ద్వారా ఇప్పటివరకు 17,571 మంది పౌరులు సర్టిఫికెట్లు విజయవంతంగా పొందారు. ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షల మంది కుల ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేస్తుండటంతో, కొత్త విధానం వలన ప్రజలకు సమయపాలనతో పాటు పారదర్శకత కలుగుతుందని అధికారులు తెలిపారు.

కొత్తగా జారీ చేసే సర్టిఫికెట్‌లో గతంలో ఆమోదం తెలిపిన అధికారి వివరాలు, తిరిగి జారీ చేసిన తేదీ స్పష్టంగా ఉంటాయి. అయితే ప్రత్యేక కేసుల్లో (ఉదా: హిందూ ఎస్సీ నుంచి క్రైస్తవ మతంలోకి మారి బీసీ-సీ కిందకు వచ్చే వారు) దరఖాస్తులు పాత విధానంలో తహసీల్దార్‌ ఆమోదానికి పంపబడతాయి.


సేవను పొందే విధానం:

  • పాత సర్టిఫికెట్‌ నంబర్‌ ఉంటే:
    మీ సేవ కౌంటర్‌లో ఆ నంబర్‌ను ఇవ్వగానే కొత్త ప్రింటవుట్‌ జారీ చేస్తారు.

  • నంబర్‌ తెలియకపోతే:
    మీ జిల్లా, మండలం, గ్రామం, ఉప-కులం, పేరు ఆధారంగా సిబ్బంది శోధించి ధ్రువీకరణ పత్రం ఇస్తారు.

➡️ మరిన్ని వివరాల కోసం మీ సేవ వెబ్‌సైట్‌ లేదా సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సంప్రదించవచ్చని కమిషనర్‌ రవికిరణ్ సూచించారు.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.