రెండు కాళ్లు కోల్పోయిన రాహుల్‌కి కొత్త ఆశలు.. సీఎం రేవంత్ రెడ్డి అండ!
హైదరాబాద్: సెప్టెంబర్ 16: జీవితం చీకటిలో మునిగిపోయిందనుకున్న ఓ విద్యార్థికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి అండతో మళ్లీ కొత్త వెలుగు చేరింది. రెండు కాళ్లు కోల్పోయి తీవ్ర ఆందోళనకు గురైన వరంగల్ జిల్లా దామెర మండలం పులకుర్తి గ్రామానికి చెందిన గుండేటి రాహుల్, సీఎం చూపిన దాతృత్వం వల్ల మళ్లీ స్వయంగా నడవగలిగే స్థాయికి చేరుకున్నాడు.
2024 నవంబర్ 2న ఐఐటీ లక్ష్యంతో రాజస్థాన్ కోటాలో శిక్షణ కోసం వెళ్తున్న సమయంలో రాహుల్‌పై గుర్తుతెలియని దుండగులు రైల్లో దాడి చేసి బయటకు తోసేయడంతో అతడు రెండు కాళ్లను పూర్తిగా కోల్పోయాడు. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లగానే మానవతా దృక్పథంతో స్పందించిన ఆయన, రాహుల్‌కి ఆధునాతన కృత్రిమ కాళ్లను అమర్చాలని అధికారులను ఆదేశించారు.
సీఎం సహాయ నిధి నుంచి 10 లక్షలకు పైగా వెచ్చించి నిమ్స్ ఆసుపత్రిలో రాహుల్‌కు చికిత్స అందించారు. ఆధునిక కృత్రిమ కాళ్లు అమర్చించుకున్న రాహుల్ ఇప్పుడు ఒక్కో అడుగు వేస్తూ సంపూర్ణంగా నడవగలిగే స్థితికి చేరుకున్నాడు.
రాహుల్ తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో బాగా చదువుకుని రాణించాలని రాహుల్‌కి భుజం తట్టి ప్రోత్సహించిన సీఎం, ఆయన దాతృత్వాన్ని చూసి కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment