తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతురు నేనే: కవిత
తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతురు నేనే: కవిత
హైదరాబాద్: సెప్టెంబర్ 21: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు అంశంపై తాను ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. పార్టీ పెడతారా అనే ప్రశ్నకు సమాధానంగా, “కేసీఆర్ ఎప్పుడూ వందల మంది నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. నేనూ అదే విధంగా ముందుకు వెళ్తున్నాను” అని తెలిపారు.
శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. “రాజకీయాల్లో మనకు ఎవరూ స్థానం కల్పించరు, మర్యాద ఇవ్వరు. తానే పోరాడి సాధించుకోవాలి. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ నన్ను సంప్రదించలేదు. నేను కూడా వారిని సంప్రదించే ఉద్దేశ్యం లేదు” అని ఆమె స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంపై మాట్లాడుతూ, “అంతా హరీషే చేశారు. ప్రతి నిర్ణయం కేసీఆర్‌దే. కాళేశ్వరం విషయంలో తప్ప హరీష్‌రావుపై నాకు ఎలాంటి కోపం లేదు” అని తెలిపారు. కాంగ్రెస్‌లో చేరాలన్న ఆలోచన లేనని మరోసారి స్పష్టం చేశారు.
“ముఖ్యమంత్రి రేవంత్ పదే పదే నా పేరు ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఆయనే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నంలో ఉన్నారా?” అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై తాను కట్టుబడి ఉన్నానని, అందరం కలసి పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
“ప్రస్తుతం నేను ఫ్రీ బర్డ్. నాతో టచ్‌లో ఉన్న బీఆర్‌ఎస్ నేతల జాబితా చాలా పెద్దది. నా రాజీనామాను స్పీకర్ ఫార్మాట్‌లో సమర్పించాను. అవసరమైతే మళ్లీ రాజీనామా పంపిస్తాను” అని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్‌పై కవిత తీవ్రంగా విమర్శలు చేశారు. “నాపై పార్టీ దాడులు, సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఆ నిజాన్ని అర్థం చేసుకుంటున్నారు” అని అన్నారు.
అల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంపు విషయంలో సుప్రీంకోర్టు ఇప్పటికే స్టే ఇచ్చినా, కర్ణాటక సిద్ధమవుతోందని విమర్శించారు. “ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టు వెళ్లాలి. ప్రభుత్వం విఫలమైతే జాగృతి తరఫున కోర్టును ఆశ్రయిస్తాం” అని హెచ్చరించారు.
“తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతురు నేనే” అని కవిత సంచలన వ్యాఖ్యలు చేసి ముగించారు.

Post a Comment