నేటి నుంచి తెలంగాణలో ఎంగిలిపూల బతుకమ్మతో సంబరాలు ప్రారంభం!
హైదరాబాద్, సెప్టెంబర్ 21: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండగ. భాద్రప్రద మాసం అమావాస్య నుంచి మొదలయ్యే ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులు ఉత్సాహంగా జరుపుకుంటారు.
రంగు రంగుల గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి పువ్వులతో బతుకమ్మను పేర్చి, సాయంత్రం ఆటపాటలతో మహిళలు ఒక చోట చేరి పండగ వాతావరణాన్ని సృష్టిస్తారు.
ఈ రోజు ఆదివారం నుంచి ‘ఎంగిలిపూల బతుకమ్మ’తో సంబరాలు ప్రారంభమవుతున్నాయి. తొలిరోజు పేర్చే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు. దీనికి ప్రత్యేకత ఏంటంటే, ఒక రోజు ముందే సేకరించిన పువ్వులను నీటిలో నానబెట్టి, మరుసటి రోజు వాటితో బతుకమ్మను పేర్చుతారు. అందుకే దీనికి “ఎంగిలిపూల బతుకమ్మ” అనే పేరు వచ్చింది.
తొలిరోజున మహిళలు తులసి దళాలు, నువ్వులు, పల్లీలు, బియ్యం పిండి, నూకలతో తయారైన నైవేద్యాన్ని సమర్పించి, బతుకమ్మ ఆట అనంతరం ప్రసాదాన్ని పంచుకుంటారు.
బతుకమ్మ అంటే ‘బతుకు’ అంటే జీవితం, ‘అమ్మ’ అంటే తల్లి – జీవితం సుఖశాంతులతో నిండాలని కోరుకునే పండుగ ఇదే. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందంగా అలంకరించుకుని, ఊరంతా కలిసి సంబరాలు జరుపుకోవడం తెలంగాణ ఆడబిడ్డల ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది.

Post a Comment