తరగతి గదిలోనే మద్యం మత్తులో నిద్ర – ఉపాధ్యాయుడి సస్పెన్షన్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం సుకుద్ పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విస్మయానికి గురిచేసే సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు మద్యం మత్తులో తరగతి గదిలోనే కుర్చీ, టేబుల్ మధ్య నేలపై పడి నిద్రలోకి జారుకోవడం స్థానికులను, విద్యార్థులను అవాక్కయ్యేలా చేసింది.
ఎస్.జీటీగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు జె.విలాస్ మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. బోధన బాధ్యతలను విస్మరించి మత్తులో తరగతి గదిలోనే నిద్రపోవడంతో విద్యార్థులు అయోమయంలో మునిగిపోయారు. పాఠాలు లేకపోవడంతో పిల్లలు ఆటలు, ముచ్చట్లలో గడిపారు.
ఈ వ్యవహారం గమనించిన గ్రామస్థులు వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదుతో సీరియస్‌గా స్పందించిన ఉట్నూర్ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ అధికారులు విచారణ జరిపి, ఉపాధ్యాయుడు విలాస్‌ను సస్పెండ్ చేశారు.
👉 విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలవాల్సిన గురువులు ఇలా నిర్వాకం ప్రదర్శించడం విద్యాభవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Post a Comment