భద్రాచలంలో వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి
భద్రాచలం, సెప్టెంబర్ 4 : భద్రాచల పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా, శాంతియుతంగా, సురక్షితంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.
గోదావరి నది తీరంలోని నిమజ్జన ఘాట్‌ల వద్ద లాంచీలు, బారికేడింగ్, లైటింగ్, సీసీ కెమెరాల పర్యవేక్షణ, తాగునీటి సదుపాయం, వైద్య బృందాలు, గజ ఈతగాళ్లను మోహరించినట్లు ఆయన వివరించారు. ఎటువంటి అపశృతి చోటుచేసుకోకుండా విస్తృత భద్రతా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా గణేశ మండప నిర్వాహకులు, భక్తులకు పలు సూచనలు చేశారు. ఊరేగింపులు శాంతియుతంగా, క్రమశిక్షణతో నిర్వహించాలని, పెద్ద సంఖ్యలో గుంపులు ఏర్పడి అల్లర్లు చేయకూడదని ఆయన సూచించారు. ఊరేగింపుల సమయంలో డీజేలు, అధిక శబ్ద పూరిత సంగీతం వాడకూడదని, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించకుండా మున్సిపల్, పోలీస్ శాఖల సూచనల మేరకు మాత్రమే కొనసాగించాలని ఆదేశించారు.
నిర్దేశించిన ప్రదేశాలలోనే విగ్రహ నిమజ్జనం జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వాహనాలను నిర్దిష్ట పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలపాలని, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు నదీ ఘాట్ వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి నిమజ్జనానికి రాకూడదని ఆయన హెచ్చరించారు.
జిల్లా ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో, శాంతియుతంగా వినాయక నిమజ్జనాన్ని నిర్వహించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
Post a Comment