మంథనిలో వైద్య విద్య రంగానికి సంపూర్ణ కృషి: మంత్రి శ్రీధర్ బాబు
మంథనిలో వైద్య విద్య రంగానికి సంపూర్ణ కృషి: మంత్రి శ్రీధర్ బాబు పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. గురువారం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఎంపీపీఎస్ బాలికల ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… “సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యను మరింత సులభతరం చేసి, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు సమానంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. మంథని నియోజకవర్గంలోని ఆరు పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సినీ నటి మంచు లక్ష్మి, టీచ్ ఫర్ చేంజ్ సంస్థ చేసిన కృషి అభినందనీయం” అని అన్నారు. వైద్య, విద్య రంగాల్లో సంపూర్ణ మార్పు తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రత్యేకంగా పేర్కొన్నారు.
టీచ్ ఫర్ చేంజ్ సంస్థ సీఈఓ మంచు లక్ష్మి మాట్లాడుతూ… “ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు కూడా కార్పొరేట్ పాఠశాలల తరహాలో నేర్చుకునే అవకాశాలు కల్పించడమే మా సంస్థ లక్ష్యం. డిజిటల్ తరగతుల ద్వారా విద్యార్థులు సృజనాత్మకత, ఆసక్తి పెంచుకొని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలు చేరుకోవాలి” అని ఆకాంక్షించారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ… డిజిటల్ క్లాస్ రూమ్స్ విద్యార్థులకు సాంకేతిక అవగాహన పెంపొందించడమే కాకుండా, పాఠ్యాంశాలపై మరింత స్పష్టతనిస్తుంది అన్నారు. “వీడియో, ఆడియోల ఆధారంగా పాఠాలు నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుంది. అమ్మ ఆదర్శ కమిటీలతో కలిసి ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు పోటీగా తీర్చిదిద్దే దిశగా కృషి జరుగుతోంది” అని వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, టీచ్ ఫర్ చేంజ్ ప్రతినిధులు, తల్లిదండ్రులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.
Post a Comment