తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములవ్వాలని సీఎం రేవంత్ పిలుపు
హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దడమే తన ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
“ఎజెండాలు, జెండాలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసిరండి. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం ఉన్నంత కాలం తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తాం. విద్య, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, పరిశ్రమలు, ఉద్యోగాలు—అన్నీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్తాం” అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ముఖ్యాంశాలు:
- చరిత్ర ప్రస్తావన: నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా 1948 సెప్టెంబర్ 17న సాధించిన విజయమే ప్రజా పాలన దినోత్సవం ప్రాముఖ్యం అని సీఎం గుర్తు చేశారు.
- విద్యా విప్లవం: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లు భవిష్యత్ విద్యా వ్యవస్థలో కీలకమని తెలిపారు. రాష్ట్ర విద్యా విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
- మహిళా సాధికారత: “మహిళా ఉన్నతి–తెలంగాణ ప్రగతి” నినాదంతో చేపడుతున్న పథకాలు ఫలితాలిస్తున్నాయని, మహిళా మార్ట్‌లు, పెట్రోల్ బంకులు దానికి నిదర్శనమని అన్నారు.
- రైతు సంక్షేమం: రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతుల పట్ల నిబద్ధత చూపుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు రూ.20,616 కోట్ల రుణమాఫీ, తొమ్మిది రోజుల్లోనే 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు అందజేశామని తెలిపారు.
- ఉద్యోగాలు: 20 నెలల్లో 60 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వివరించారు. సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ‘రాజీవ్ గాంధీ సివిల్స్ ఆభయ హస్తం’ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు తెలిపారు.
- భూసంస్కరణలు: ధరణి కారణంగా ఏర్పడిన సమస్యల నేపథ్యంలో భూభారతి చట్టం తీసుకువచ్చామని, గ్రామ పాలనా అధికారుల నియామకంతో దాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.
- పట్టణ అభివృద్ధి: హైదరాబాదును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దిశగా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, గాంధీ సరోవర్ ప్రాజెక్టు, మెట్రో రెండో దశ విస్తరణ వంటి ప్రాజెక్టులను చేపడుతున్నామని వివరించారు.
- మాస్టర్ ప్లాన్: 2047 నాటికి దేశ అభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలన్న లక్ష్యంతో “తెలంగాణ రైజింగ్ 2047” సంకల్ప పత్రాన్ని డిసెంబర్ 9న ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, డీజీపీ జితేందర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Post a Comment