కొత్తగూడెంలో దారుణం.. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి హత్య
భద్రాద్రి కొత్తగూడెం: సెప్టెంబర్ 23 : కొత్తగూడెం పట్టణం త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటుచేసుకుంది. గుబ్బల రామ్మోహన్‌రావు (60) అనే సింగరేణి విశ్రాంత ఉద్యోగిని గుర్తు తెలియని దుండగులు నరమేధం చేశారు.
సోమవారం రాత్రి గణేష్ టెంపుల్ ఏరియాలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు ఇంటిలోకి చొరబడ్డారు. వెంటనే రామ్మోహన్‌రావుపై దాడి చేసి, బయటకు లాక్కెళ్లి సుత్తితో తలపై బలంగా కొట్టారు. ఒక్కసారిగా రక్తస్రావం ఎక్కువగా కావడంతో రామ్మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అరుపులు విన్న స్థానికులు బయటకు పరుగెత్తి వచ్చి ఆ దృశ్యం చూసి భయభ్రాంతులకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో త్రీ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్ బృందాలను రప్పించి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు సేకరిస్తున్నారు.
ఈ దారుణ హత్య వెనుక గల కారణాలు ఇప్పటికీ స్పష్టంగా తెలియరావడం లేదని, నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Post a Comment