రేపటి నుంచి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు!

రేపటి నుంచి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు!

రేపటి నుంచి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు!

కరీంనగర్, సెప్టెంబర్ 20: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ సంబరాలు రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈసారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం వరంగల్ జిల్లా వెయ్యి స్తంభాల గుడిలో ఉత్సవాలను ప్రారంభించి, ఈ నెల 30న హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ముగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా శనివారం కరీంనగర్ పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని, పుష్పాలతో బతుకమ్మలను పేర్చి, ఆడిపాడుతూ నృత్యాలతో సందడి చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో మరింత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సకల జనులు, అన్ని వర్గాలు కలిసి ఏకత్వ స్ఫూర్తిని చాటాలని కోరారు.

చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా కొనసాగనున్నాయి. ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని బతుకమ్మ ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ట పెంచుతోందని సీఎం అన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపుతూ సుఖసంతోషాలతో జీవించేలా దీవించాలని ఆకాంక్షించారు. సంప్రదాయబద్ధంగా బతుకమ్మను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.