ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీకి మరో భారీ దెబ్బ!

 

నారాయణ్‌పూర్‌లో ఎన్‌కౌంటర్ – ఇద్దరు సెంట్రల్‌ కమిటీ సభ్యులు హతం

నారాయణ్‌పూర్‌లో ఎన్‌కౌంటర్ – ఇద్దరు సెంట్రల్‌ కమిటీ సభ్యులు హతం

ఛత్తీస్‌గఢ్‌, సెప్టెంబర్‌ 23: మావోయిస్టు ఉద్యమానికి బలమైన ఆధారం అయిన కేంద్ర కమిటీ వరుస ఎన్‌కౌంటర్లతో కుదేలవుతోంది. నారాయణ్‌పూర్ జిల్లాలో భద్రతా బలగాలు మంగళవారం నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కీలక సెంట్రల్‌ కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్‌ కోసా, కట్టా రామచంద్రారెడ్డి అలియాస్‌ వికల్ప్ హతమయ్యారు. దీంతో ఎర్రదళానికి మరో గట్టి దెబ్బ తగిలింది.

ఇప్పటికే మావోయిస్టు సుప్రీం కమాండర్‌ నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు ఎన్‌కౌంటర్‌ తర్వాత ఉత్సాహంతో ఉన్న భద్రతా బలగాలు రాష్ట్రవ్యాప్తంగా కూంబింగ్‌ ఆపరేషన్లను వేగవంతం చేశాయి. పక్కా సమాచారంతో మావోయిస్టుల కదలికలను గుర్తించి దాడి చేస్తున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ట్విట్టర్‌లో స్పందిస్తూ – “మావోయిస్టు అగ్రనాయకులు ఒక్కొక్కరిని నేలకొరుగుతున్నాం. మిగిలినవారిని కూడా అంతమొందిస్తాం. 2026 మార్చి 31 నాటికి దేశం మావోయిస్టు రహితం అవుతుంది” అని ప్రకటించారు.

వరుస ఎన్‌కౌంటర్లతో సెంట్రల్‌ కమిటీ కుదేలవుతోంది

ఆపరేషన్‌ కగార్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు 11 మంది కేంద్ర కమిటీ నేతలు భద్రతా బలగాల దాడుల్లో హతమయ్యారు. ప్రస్తుతం కమిటీలో మిగిలింది ఏడుగురే. ముప్పేటదాడులతో మావోయిస్టులకు ఊపిరి పీల్చుకునే సమయమే ఇవ్వడం లేదని భద్రతా అధికారులు చెబుతున్నారు.

కోవర్ట్‌ ఆపరేషన్‌ వెనక కథ

నాలుగు నెలల క్రితం ప్రారంభమైన రహస్య ఆపరేషన్లే మావోయిస్టు అగ్రనేతల వరుస ఎన్‌కౌంటర్లకు కారణమని సమాచారం. నంబాల కేశవరావు దగ్గర పనిచేసిన ఐదుగురు మావోయిస్టులను పోలీసులు రహస్యంగా డీఆర్‌జీలో చేర్చడం, వారిలో కొందరు లొంగిపోవడంతో కీలక సమాచారం లభించింది. అదే ఆధారంగా మొదట నంబాల ఎన్‌కౌంటర్‌ జరిగింది. తరువాత కడారి సత్యనారాయణరెడ్డి, కట్టా రామచంద్రారెడ్డి సహా పలువురు అగ్రనేతలు అదే ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పోయారు.

చర్చలపై కేంద్రం గట్టి వైఖరి

మావోయిస్టులు కాల్పుల విరమణకు బేషరతుగా సిద్ధమని, చర్చలకు రావాలని సంకేతాలు ఇస్తున్నా.. కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదు. “చర్చలకు అవకాశం ఇస్తే ఆపరేషన్‌ సైడ్‌ట్రాక్‌ అవుతుంది” అనే అభిప్రాయంతోనే హోంశాఖ ముందుకు సాగుతోంది.

2014 నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,700 మంది మావోయిస్టులు హతమయ్యారు. వారిలో 345 మంది అగ్రనేతలే. వరుస ఎన్‌కౌంటర్లతో ఉద్యమానికి ఆధారమైన కేంద్ర కమిటీ దాదాపుగా ఖాళీ అయింది. ఈ వేగం కొనసాగితే 2026 డెడ్‌లైన్‌కంటే ముందే మావోయిస్టు ఏరివేత పూర్తవుతుందని భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.