రామగిరి మండలంలో విషజ్వరంతో మహిళ మృతి
పెద్దపల్లి, అక్టోబర్ 6 పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని పన్నూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిందం శారద (37) విషజ్వరంతో సోమవారం ఉదయం మృతి చెందింది.
మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న శారదను కుటుంబ సభ్యులు శనివారం రాత్రి కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇటీవలి కాలంలో గ్రామంలో విషజ్వరాలు అధికమవుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గ్రామంలో పారిశుద్ధ్య లోపం, డ్రైనేజీల్లో నిలిచిపోయిన మురుగునీరు కారణంగా ఈ జ్వరాలు వ్యాపిస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
స్థానిక అధికారులు తక్షణ చర్యలు తీసుకుని గ్రామంలో శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేశారు. శారద మృతితో పన్నూరు గ్రామం విషాదంలో మునిగిపోయింది.

Post a Comment