“అక్కడ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే ఇక్కడికి వస్తారా?” — సుప్రీంకోర్టు

“అక్కడ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే ఇక్కడికి వస్తారా?” — సుప్రీంకోర్టు

బీసీ రిజర్వేషన్ వ్యతిరేక పిటిషన్‌ను కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం

హైదరాబాద్: అక్టోబర్ 06: తెలంగాణలో బీసీ రిజర్వేషన్‌లపై సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ తీర్పుతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది.

తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్‌ 9ను సవాల్ చేస్తూ వంగా గోపాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్‌నాథ్‌, జస్టిస్ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

విచారణ సందర్భంగా ధర్మాసనం పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ఉద్దేశించి “హైకోర్టులో ఇదే అంశంపై కేసు విచారణలో ఉండగా, ఇక్కడికి ఎందుకు వచ్చారు?” అని ప్రశ్నించింది. దీనికి న్యాయవాది స్పందిస్తూ, “హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది” అని సమాధానం ఇచ్చారు.

దాంతో ధర్మాసనం “అక్కడ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే ఇక్కడికి వస్తారా?” అంటూ వ్యాఖ్యానించింది. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ, పిటిషన్‌ను తిరస్కరించింది.

వంగా గోపాల్ రెడ్డి తన పిటిషన్‌లో, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల మొత్తం 67 శాతం అవుతుందని, ఇది సుప్రీంకోర్టు నిర్ణయించిన 50 శాతం పరిమితిని మించిందని వాదించారు. అలాగే జీఓ నంబర్‌ 9ను చట్టవిరుద్ధంగా పేర్కొంటూ రద్దు చేయాలని కోరారు. ఈ కేసులో మాధవరెడ్డి, తీన్మార్ మల్లన్న కూడా ఇంప్లీడ్ అయ్యారు.

గత నెల 26న రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్‌ 9 ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ఎన్నికలు అక్టోబర్‌ 9 నుంచి నవంబర్‌ 11 వరకు ఐదు దశల్లో జరగనున్నాయి.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.