తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు!స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు!స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం


హైదరాబాద్ అక్టోబర్ 29: ఏపీని వణికించిన మొంథా తుపాను మంగళవారం రాత్రి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సమీపంలో తీరాన్ని తాకింది. తీరం దాటిన తర్వాత బుధవారం ఉదయానికి తుపానుగా, సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

అయితే తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంపైనా తీవ్రంగా కనిపిస్తోంది. మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజాము నుండి హైదరాబాద్‌లో వర్షం కురుస్తూనే ఉంది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించి పడ్డాయి.

వికారాబాద్ జిల్లాలోని మోమిన్‌పేటలో మంగళవారం అత్యధికంగా 4.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, బుధవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు తుపానుతో ఎక్కువగా ప్రభావితమవనున్నాయి.

ఈ జిల్లాల్లో తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

వర్షాల దృష్ట్యా ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. పిల్లలను బయటకు పంపవద్దని తల్లిదండ్రులకు అధికార యంత్రాంగం సూచించింది.

ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రకటనలో మాట్లాడుతూ “జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికీ బుధవారం సెలవు ప్రకటించాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,” అని తెలిపారు.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.