ఏపీలో మరో దారుణం..! ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం – అతి పెద్ద ప్రమాదం తప్పింది
నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారిపై ఘటన
నెల్లూరు: కర్నూలు బస్సు ప్రమాదం మరువకముందే ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఐరన్ బారికేడును ఢీకొట్టింది. లారీని ఓవర్టేక్ చేయబోయి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తూ ఐరన్ బారికేడ్ ఉండటంతో బస్సు పల్టీ కొట్టకుండా పెద్ద ప్రమాదం తప్పింది.
ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 34 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే వారిని ఇతర వాహనాల్లో గమ్యస్థానాలకు తరలించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. వరుసగా ప్రైవేట్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.
ఇక కర్నూలు ప్రమాదం నేపథ్యంలో నెల్లూరు రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్‌టీవో మదానీ ఆధ్వర్యంలో పూలే బొమ్మ సెంటర్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై తనిఖీలు చేపట్టారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ సరిగా లేని రెండు బస్సులను అధికారులు సీజ్ చేశారు.

Post a Comment