కుండపోత వర్షంతో నగరం మొత్తం జలదిగ్బంధంలో వరంగల్
వరంగల్, అక్టోబర్ 30: మొంథా తుపాను ప్రభావంతో వరంగల్ నగరం బుధవారం సాయంత్రం నుండి భారీ వర్షాలకు తడిసి ముద్దైంది. కుండపోత వర్షంతో నగరం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది.
హంటర్ రోడ్డులోని బొంది వాగు ఉప్పొంగిపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్థంభించిపోయాయి. ములుగు రోడ్డులో నాలా ఉద్ధృతంగా ప్రవహించడంతో వరంగల్–హనుమకొండ మధ్య రహదారి మీద రవాణా పూర్తిగా నిలిచిపోయింది.
నగరంలోని సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేష్ కాలనీ వంటి తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఇళ్లలోకి వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు కుటుంబాలు పై అంతస్తులకెళ్లి తలదాచుకున్నాయి.
స్థానిక మున్సిపల్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. వర్షపాతం కొనసాగుతుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

Post a Comment