రేపే మద్యం దుకాణాల లక్కీ డ్రా!మద్యం దుకాణాల టెండర్లపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, అక్టోబర్ 26: తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్లపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, రాష్ట్రవ్యాప్తంగా కొత్త దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తులు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ వెల్లడించారు.
జిల్లా కేంద్రాల వారీగా లక్కీ డ్రా కార్యక్రమాలు జరుగనున్నాయి. ప్రతి జిల్లాలో ఎక్సైజ్ అధికారులు, జిల్లా కలెక్టర్ల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాల కోసం 95,137 దరఖాస్తులు వచ్చాయి.
కొంతమంది వ్యాపారులు గ్రూపులుగా ఏర్పడి పదుల సంఖ్యలో దరఖాస్తులు చేసుకోవడంతో పోటీ తీవ్రంగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో వైన్స్ లైసెన్స్‌ల కోసం భారీగా దరఖాస్తులు రావడంతో ఉత్కంఠ నెలకొంది.
ఎక్సైజ్ అధికారులు లక్కీ డ్రా పూర్తయిన వెంటనే లైసెన్స్ లభించిన వారికి నోటిఫికేషన్లు పంపనున్నారు. ఈసారి లైసెన్స్‌ల కేటాయింపులో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు.
ఉత్కంఠభరితంగా మారిన ఈ డ్రా ఫలితాలపై మద్యం వ్యాపార వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

Post a Comment