బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం ఆరుగురు దుర్మరణం

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం ఆరుగురు దుర్మరణం


కోనసీమ జిల్లా, అక్టోబర్ 08: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాయవరం మండలం పరిధిలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించడంతో పరిసరాలు దద్దరిల్లాయి. పేలుడు అనంతరం మంటలు వేగంగా వ్యాపించి మొత్తం ఫ్యాక్టరీని చుట్టుముట్టాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

పేలుడు కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే రసాయన ప్రతిచర్య వల్లే ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభమైంది.

ఈ ప్రమాదంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పండుగల సీజన్‌లో బాణసంచా ఫ్యాక్టరీల్లో సరైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.