గురుకులంలో బాలుడిపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి

గురుకులంలో బాలుడిపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి

నిందితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య

ఖమ్మం జిల్లా, కొణిజర్ల: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల పరిధిలోని ఓ గురుకుల పాఠశాలలో మానవత్వాన్ని మరిచిపోయే సంఘటన వెలుగుచూసింది. 14 ఏళ్ల బాలుడిపై ఉపాధ్యాయుడు మూడు సంవత్సరాలుగా లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ దారుణంపై ఫిర్యాదు నమోదు చేయడంతో, నిందితుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

కొణిజర్ల ఎస్సై సూరజ్ తెలిపిన వివరాల ప్రకారం — మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన అరిగెల ప్రభాకర్‌రావు (46) ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. తొమ్మిదో తరగతి విద్యార్థిపై గత మూడు సంవత్సరాలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. భయంతో బాలుడు ఎవరితోనూ చెప్పలేకపోయాడు.

దసరా సెలవుల్లో ఇంటికి వెళ్లిన బాలుడు పాఠశాలకు తిరిగి వెళ్లడానికి నిరాకరించాడు. తల్లిదండ్రులు కారణం అడగగా ఉపాధ్యాయుడు తనపై చేస్తున్న దురాగతాన్ని వెల్లడించాడు. ఈ విషయంపై బాలుడి తండ్రి ఆదివారం రాత్రి కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితుడు ప్రభాకర్‌రావుపై పోక్సో కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై ప్రిన్సిపల్ మందలించడంతో ప్రభాకర్‌రావు ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కేసు నమోదైనట్లు తెలిసి తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఆదివారం రాత్రి స్వగ్రామం ఆత్కూరులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఇంటికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పడంతో కుటుంబ సభ్యులు అతడిని మధిరలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతిచెందాడు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.