తెలంగాణలో కొనసాగుతున్న కాలేజీల బంద్! ప్రభుత్వంతో చర్చలు విఫలం
హైదరాబాద్, నవంబర్ 07: తెలంగాణలో ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల బంద్ కొనసాగుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులో ఆలస్యం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా వృత్తి విద్య, డిగ్రీ, పీజీ కళాశాలలు తలుపులు మూసేశాయి. ఇప్పటికే నాలుగో రోజుకి చేరుకున్న ఈ బంద్ కారణంగా వేలాది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వం–ప్రైవేటు కళాశాల యాజమాన్యాల మధ్య చర్చలు జరిగినా, స్పష్టమైన ఫలితం కనిపించలేదు. ఇరువైపులా ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి.
ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల ఫెడరేషన్ ఆందోళనను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది. యాజమాన్యాలు స్పష్టం చేశాయి — “ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో కనీసం 50 శాతం నిధులు విడుదల చేసినప్పుడే సమ్మె విరమిస్తాం” అని.
గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా రెండు వేలకుపైగా కాలేజీలు బంద్‌లో ఉన్నాయి. ముఖ్యంగా డిప్లొమా, డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలను మెజారిటీ సంస్థలు బహిష్కరించాయి.
ఇక రేపు (శనివారం) హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సుమారు 30 వేలమంది అధ్యాపకులతో సాంత్వన సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు ఫెడరేషన్ ప్రకటించింది. ఈ సభలో భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Post a Comment