జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు

జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు


హైదరాబాద్ : నవంబర్ 19: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ, జాగృతి నాయకులు – హెచ్ఎంఎస్ కార్యకర్తలతో కలిసి నాంపల్లిలోని సింగరేణి భవన్‌ ముట్టడికి కవిత ప్రయత్నం చేశారు.

కార్యకర్తలతో కలిసి ఆటోలో సింగరేణి భవన్‌కు చేరుకున్న కవిత, డిపెండెంట్ ఉద్యోగాల పునరుద్ధరణ, మెడికల్ బోర్డు ఏర్పాటు వంటి ముఖ్య డిమాండ్లను వినిపించారు. ముట్టడి చేయడానికి ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకోవడంతో స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తోపులాట జరుగగా, కవితతో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

అరెస్ట్ సందర్భంలో కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి. తెలంగాణలోని బొగ్గు బ్లాకుల వేలం వెంటనే నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు. కొత్త బ్లాకులను మాత్రమే సింగరేణికి కేటాయించాలి, ఇది సంస్థ ఆర్థిక స్థిరత్వానికి కీలకమని అన్నారు.

అదే సమయంలో, సింగరేణి పరిధిలోని ప్రతి కాంట్రాక్టులో 25% అవినీతి జరుగుతోందని, అందులో 10% కాంగ్రెస్ నాయకులకే వెళ్తుందని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకపోతే సీబీఐని ఆశ్రయిస్తామని కవిత హెచ్చరించారు.

కార్మికులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు, సింగరేణి కార్మికుల జీతాలపై వసూలు చేస్తున్న ఆదాయపు పన్నును నిలిపివేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.