యూట్యూబ్‌లో ‘హత్య’ సూత్రాలు నేర్చుకుని అత్తను సజీవదహనం చేసిన కోడలు
విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో దారుణ ఘటన
విశాఖపట్నం: అత్త చాదస్తం భరించలేక కోడలు దారుణానికి పాల్పడిన ఘటన విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం వేపగుంట అప్పన్నపాలెంలో చోటుచేసుకుంది. చిన్న చిన్న మాటలతో విసిగి పోయిన ఓ కోడలు అత్తను సజీవదహనం చేసి, ఆ తర్వాత ప్రమాదంలా చూపేందుకు ప్రయత్నించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం — వర్షిణి అపార్ట్‌మెంట్‌లో జయంతి సుబ్రహ్మణ్యం తన తల్లి కనకమహాలక్ష్మి (63), భార్య లలితాదేవి (30), ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి సుబ్రహ్మణ్యం పౌరోహిత్య పనుల నిమిత్తం బయటకు వెళ్లగా, లలితాదేవి ముందుగానే వేసుకున్న పథకాన్ని అమలు చేసింది.
‘దొంగా-పోలీస్’ ఆట పేరుతో పిల్లలతో కలసి అత్త కనకమహాలక్ష్మిని నమ్మించి వాలుకుర్చీలో కూర్చోబెట్టింది. ఆ తర్వాత చున్నీతో కళ్లకు గంతలు కట్టి, చేతులు కాళ్లు తాళ్లతో కట్టేసి, ముందుగా దాచిపెట్టిన పెట్రోల్‌ను ఆమెపై పోసి నిప్పంటించింది. మంటల్లో చిక్కుకున్న కనకమహాలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, అరుపులు విన్న మనవరాలు శ్రీనయనకు కూడా మంటలు అంటుకుని గాయాలయ్యాయి.
ఘోరాన్ని కప్పిపుచ్చేందుకు లలితాదేవి నాటకం వేసింది. ఇంట్లో టీవీ పేలిపోవడంతో ప్రమాదం జరిగిందంటూ అరుస్తూ పొరుగువారిని పిలిచింది. వారంతా అగ్నిప్రమాదమని భావించినా, ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పెట్రోల్ వాసన రావడంతో అనుమానపడ్డారు.
దర్యాప్తులో భాగంగా లలితాదేవి మొబైల్‌ఫోన్ హిస్టరీని పరిశీలించిన పోలీసులు “హత్య ఎలా చేయాలి?”, “నేరం చేసి ఎలా తప్పించుకోవాలి?” వంటి వీడియోలను ఆమె యూట్యూబ్‌లో సర్చ్ చేసినట్టు గుర్తించారు. అదేవిధంగా భర్త సుబ్రహ్మణ్యం కూడా తన భార్య ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తం చేయడంతో కేసు మిస్టరీ వీడింది.
తరువాత విచారణలో లలితాదేవి నేరాన్ని అంగీకరించింది. అత్త చాదస్తం, నిరంతర తిట్లు, విమర్శలతో విసిగిపోయి ఈ దారుణానికి పాల్పడినట్టు చెప్పింది. మృతురాలి కుమారుడు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
విశాఖలో కలకలం రేపిన సజీవదహన హత్య కేసుపై విచారణ కొనసాగుతోంది.

Post a Comment