ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది సజీవదహనం చిత్రదుర్గ జిల్లా గొర్లత్తు గ్రామం వద్ద బస్సు–లారీ ఢీ

ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది సజీవదహనం చిత్రదుర్గ జిల్లా గొర్లత్తు గ్రామం వద్ద బస్సు–లారీ ఢీ


కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తున్న సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సును చిత్రదుర్గ జిల్లా గోర్లత్తు గ్రామం సమీపంలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది.

లారీ బస్సు యొక్క డీజిల్ ట్యాంకును ఢీకొట్టడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు అగ్నికి ఆహుతి అయింది. ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది ప్రయాణికులు సజీవదహనం కావడంతో మృతి చెందినట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు బయటకు రాలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన మరికొందరిని సమీప ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బస్సు పూర్తిగా కాలిపోయింది. మృతదేహాలు తీవ్రంగా కాలిపోవడంతో గుర్తింపు ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది.

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.