కుటుంబ కలహాలు: భార్యను ఉరివేసి హత్య చేసిన భర్త.. అనంతరం ఆత్మహత్య
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మనస్తాపం నేపథ్యంలో ఓ వ్యక్తి భార్యను హత్య చేసి అనంతరం తానే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గణపురం ఎస్‌ఐ రేఖ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాంపురం గ్రామానికి చెందిన రామాచారి (55)కు గతంలో రెండు వివాహాలు జరిగాయి. మొదటి భార్య మృతి చెందగా, రెండో భార్యకు విడాకులు ఇచ్చాడు. అనంతరం మైలారం గ్రామానికి చెందిన సంధ్యను సుమారు 20 ఏళ్ల క్రితం మూడో వివాహం చేసుకున్నాడు.
వీరి కుమార్తె వైష్ణవి (19) ఇటీవల గణపురం మండల కేంద్రానికి చెందిన యువకుడిని కులాంతర వివాహం చేసుకుంది. ఈ వివాహానికి భార్య సంధ్య సహకరించిందని అనుమానిస్తూ రామాచారి తరచూ ఆమెతో గొడవ పడేవాడు. అదేవిధంగా రామాచారికి అనారోగ్యం ఉండటంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువయ్యాయి.
ఈ పరిస్థితులన్నీ కలిసి అతడిని తీవ్ర మనస్తాపానికి గురి చేశాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న భార్య సంధ్యను తాడుతో ఉరివేసి హత్య చేసిన రామాచారి, అనంతరం తన మొబైల్ ఫోన్‌లో ఓ వీడియో రికార్డు చేసి స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఆ తర్వాత తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనను గమనించిన సంధ్య కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులతో కలిసి ఇంటిని పరిశీలించగా రామాచారి, సంధ్య ఇద్దరూ మృతి చెంది ఉన్నట్లు నిర్ధారించారు.
మృతురాలి తల్లి సెగ్గోజు భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు గణపురం ఎస్‌ఐ తెలిపారు.

Post a Comment