నూతన సంవత్సర వేడుకలపై కఠిన ఆంక్షలు విధించిన హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్ | డిసెంబర్ 14: న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1 వరకు అమలయ్యేలా త్రీ స్టార్ హోటళ్లు, క్లబ్బులు, పబ్‌లు, బార్ కమ్ రెస్టారెంట్ల నిర్వహణపై మార్గదర్శకాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ వెల్లడించారు.
నూతన సంవత్సరం వేడుకలు శాంతియుతంగా జరగాలనే ఉద్దేశంతో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, మత్తు పదార్థాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈవెంట్ల నిర్వహణపై కీలక నిబంధనలు
- ప్రతి ఈవెంట్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరి
- అశ్లీల నృత్యాలకు అనుమతి లేదు
- రాత్రి 10 గంటల తర్వాత ఔట్‌డోర్ లౌడ్ స్పీకర్లకు నిషేధం
- డీజేలకు పూర్తిగా నిషేధం
- శబ్ధ పరిమితి 45 డెసిబుల్స్‌కు మించకూడదు
- కెపాసిటీకి మించి పాసులు జారీ చేయరాదు
- సరిపడా సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు చేయాలి
- ఈవెంట్లను రాత్రి 12:30 లోపు ముగించాలి
- ఈవెంట్ నిర్వాహకులు 15 రోజుల ముందే పోలీస్ అనుమతి తీసుకోవాలి
మైనర్లు, మద్యం, డ్రగ్స్‌పై కఠిన చర్యలు
- పబ్‌లు, బార్లలో మైనర్లకు అనుమతి లేదు
- మైనర్లు వాహనాలు నడిపితే వాహన యజమానిపై కేసు
- డ్రగ్స్ వినియోగం, సరఫరా చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు
- సమయానికి మించి మద్యం సరఫరా చేయరాదు
- బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు
ట్రాఫిక్ నిబంధనలు & డ్రంకెన్ డ్రైవ్ చర్యలు
- మద్యం తాగి వాహనం నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష
- జిల్లా వ్యాప్తంగా డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులు
- అతి వేగం, ర్యాష్ డ్రైవింగ్‌పై కేసులు
- ట్రిపుల్ రైడింగ్, సైలెన్సర్ తొలగించిన వాహనాలు సీజ్
- రోడ్లపై ర్యాలీలు, గుంపులుగా తిరగడం నిషేధం
- రోడ్లపై బాణాసంచా కాల్చడం నిషేధం
శివారు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. డిసెంబర్ 31 రాత్రి మొత్తం ట్రాఫిక్ నియంత్రణతో పాటు శాంతిభద్రతలపై గట్టి చర్యలు చేపట్టనున్నారు.
న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న నగరం
2025కి వీడ్కోలు పలుకుతూ, 2026కు స్వాగతం పలికేందుకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. అయితే విధించిన ఆంక్షల నేపథ్యంలో పలువురు యువత కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లలోనే వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు యువకులు బెంగళూరు, గోవా, ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
ప్రజలు పోలీసుల నిబంధనలను పాటించి, శాంతియుతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Post a Comment