హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం: ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ
గోదావరిఖని / దేశంలో మైనారిటీల హక్కులు కేవలం మాటలకే పరిమితం కాకుండా కార్యాచరణలోకి రావాల్సిన అవసరం ఉందని జమాత్ ఇ ఇస్లామీ హింద్ వైస్ ప్రెసిడెంట్, హింద్ మజ్దూర్ సభ (HMS) జాతీయ కార్యదర్శి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ స్పష్టం చేశారు.
జాతీయ మైనారిటీ హక్కుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలు తమ హక్కుల సాధనకు సంఘటిత పోరాటాలే శరణ్యమని పిలుపునిచ్చారు.
ముస్లింలు ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబాటులోనే
దేశ జనాభాలో ముస్లింల సంఖ్య సుమారు 19.7 కోట్లు, అంటే 14.2 శాతం ఉన్నప్పటికీ, ఈ విస్తృత జనాభాలో పెద్ద భాగం ఇప్పటికీ ఆర్థికంగా వెనుకబడి ఉందన్నారు. దీనికి ప్రధాన కారణం విద్యా లోపం అని పేర్కొన్నారు. ముస్లింల అవగాహన లోపంతో పాటు, పాలకుల నిర్లక్ష్యం కూడా ఈ పరిస్థితికి కారణమని విమర్శించారు.
2011 గణాంకాలే ఆధారం.. తాజా డేటా లేదు
2011 జనగణన ప్రకారం దేశంలోని ముస్లింల అక్షరాస్యత రేటు 57.28 శాతం మాత్రమేనని, ఇది ఇతర మత సమూహాలతో పోలిస్తే చాలా తక్కువని గుర్తు చేశారు. విద్యా సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా, ముస్లింల విద్యా స్థితిలో గణనీయమైన మార్పు రాలేదని అన్నారు. అంతేకాదు, 2011 తర్వాత మతాల వారీగా అక్షరాస్యతపై తాజా అధికారిక గణాంకాలను ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయకపోవడం ఆందోళనకరం అని వ్యాఖ్యానించారు.
ఉన్నత విద్యలో 5 శాతం లోపే ముస్లింల వాటా
కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE) గణాంకాల ప్రకారం, దేశంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల్లో ముస్లింల వాటా ఐదు శాతం లోపే ఉందన్నారు. జనాభాలో 14 శాతానికి పైగా ఉన్న సమాజం విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో మూడో వంతు ప్రాతినిధ్యం కూడా పొందలేకపోవడం తీవ్ర ఆందోళనకరమని తెలిపారు. దీని ప్రభావం ఉద్యోగ రంగంలోనూ స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
విద్యా లోపమే ఉద్యోగ వెనుకబాటుకు కారణం
ప్రభుత్వ పాఠశాలలు బాధ్యతాయుతంగా పనిచేయకపోవడం, ప్రైవేట్ లేదా కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివించే ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో ముస్లిం పిల్లలు మధ్యలోనే చదువును మానేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ సర్వేలు చెబుతున్న ప్రకారం 5 నుంచి 9 ఏళ్ల మధ్య వయసున్న ముస్లిం పిల్లల్లో అధిక శాతం పాఠశాలల వెలుపలే ఉన్నారు. ఉన్నత విద్య పూర్తి చేసినా ఉద్యోగాలు సులభంగా దొరకడం లేదని, ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంలోనూ వివక్ష కొనసాగుతోందని విమర్శించారు.
రాజకీయ ప్రాతినిధ్యంలో తీవ్ర లోటు
2024 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 543 మంది సభ్యుల్లో కేవలం 24 మంది మాత్రమే ముస్లిం ఎంపీలు ఉండడం, అంటే 4.4 శాతం ప్రాతినిధ్యం మాత్రమే ఉండటం ముస్లింల రాజకీయ వెనుకబాటుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర శాసనసభల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని, కొన్ని రాష్ట్రాల్లో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
లౌకిక భారతానికి ఇది శోభించదు
దేశంలోని అతిపెద్ద మైనారిటీ సమాజం అన్ని రంగాల్లో హక్కుల నిరాకరణకు గురవుతుంటే, స్వాతంత్ర్యం, అభివృద్ధి అనే మాటలకు అర్థం ఏముంటుందని ప్రశ్నించారు. లౌకిక, ప్రజాస్వామ్య భారతదేశానికి ఇది ఎంతమాత్రం శోభించదన్నారు.
మైనారిటీలపై వివక్ష, పక్షపాత విధానాలు కొనసాగితే దేశ భవిష్యత్తే మసకబారుతుందని హెచ్చరించారు.
సచార్ కమిటీ నివేదిక అమలు చేయాలి
ఇప్పటికైనా పాలక వర్గాలు కళ్ళు తెరిచి ముస్లిం మైనారిటీల సంక్షేమానికి నిజాయితీగా కృషి చేయాలని కోరారు. సచార్ కమిటీ నివేదికను సమగ్రంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అదే సమయంలో ముస్లింలు కూడా ఎవరో ఏదో చేస్తారని ఎదురుచూడకుండా, సామాజిక చైతన్యం, స్పష్టమైన ప్రణాళికతో తమ హక్కుల సాధనకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రాతినిధ్య చట్టాల్లో తమ హక్కుల వాటా కోసం కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Post a Comment