పసుపు రైతాంగం సంక్షేమానికి టర్మరిక్ సమ్మిట్ కీలకం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

పసుపు రైతాంగం సంక్షేమానికి టర్మరిక్ సమ్మిట్ కీలకం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గిట్టుబాటు ధర, విలువ జోడింపు, ఎగుమతులపై సమగ్ర దృష్టి అవసరం


హైదరాబాద్, డిసెంబర్ 17, 2025: దేశంలో పండే పసుపును ప్రపంచ మార్కెట్లలో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు సమిష్టి చర్యలు అవసరమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లో CII తెలంగాణ, నేషనల్ టర్మరిక్ బోర్డు సంయుక్తంగా నిర్వహించిన టర్మరిక్ వాల్యూ చైన్ సమ్మిట్ – 2025 లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

Agri Vision 2047 లో పసుపుకు కీలక పాత్ర

ఇటీవల నిర్వహించిన Telangana Rising Global Summit లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన Agri Vision – 2047 ను మంత్రి గుర్తు చేశారు. ఈ విజన్‌లో వ్యవసాయాన్ని కేవలం సంక్షేమ రంగంగా కాకుండా, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంజన్‌గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యముందని తెలిపారు. ఈ అగ్రి విజన్‌లో పసుపు పంటకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు.

పసుపు సంస్కృతి నుంచి గ్లోబల్ మార్కెట్ దాకా

పసుపు మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన పంట అని, ప్రస్తుతం అది వంటింటికే పరిమితం కాకుండా మెడిసిన్, న్యూట్రాస్యూటికల్స్, ఫంక్షనల్ ఫుడ్స్ వంటి రంగాల్లో విస్తృతంగా ఉపయోగంలోకి వస్తోందని మంత్రి వివరించారు.

పసుపు ఉత్పత్తిలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు

ప్రపంచవ్యాప్తంగా పసుపు ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉందని, పసుపు సాగులో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా నిజామాబాద్, ఆర్మూర్ ప్రాంతాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయని చెప్పారు. ఆర్మూర్ పసుపుకు GI ట్యాగ్ రావడం తెలంగాణ రైతులకు గర్వకారణమన్నారు.

టర్మరిక్ బోర్డు రైతులకు దిశానిర్దేశం చేయాలి

నిజామాబాద్ రైతుల చిరకాల ఆకాంక్ష మేరకు నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటైనా, అది పూర్తిస్థాయిలో కార్యాచరణలోకి రావాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ బోర్డు కార్యాలయ పరిమితుల్లో కాకుండా, రైతులకు పాలసీ దిశ చూపే సంస్థగా, పరిశోధనను పొలాల వరకు తీసుకెళ్లే వేదికగా మారాలని సూచించారు. మార్కెటింగ్, బ్రాండింగ్, ఎగుమతుల్లో టర్మరిక్ బోర్డు నాయకత్వం వహించాలన్నారు.

ధరల అస్థిరతపై రైతుల ఆందోళన

తెలంగాణలో అనుకూల వాతావరణం, శ్రమించే రైతులు ఉన్నప్పటికీ ధరల హెచ్చు–తగ్గుల వల్ల పసుపు సాగు విస్తీర్ణం తగ్గుతోందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక క్వింటాల్ పసుపు ఉత్పత్తికి రూ.8,000 నుంచి రూ.9,000 వరకు ఖర్చవుతుండగా, మార్కెట్ ధరలు రూ.12,000 చుట్టూ మాత్రమే ఉండటం రైతులను నిరుత్సాహపరుస్తోందన్నారు.

ధరల స్థిరత్వానికి స్పష్టమైన విధానం అవసరం

విజన్ 2047కు అనుగుణంగా నేషనల్ టర్మరిక్ బోర్డు పనిచేసి, ధరల స్థిరత్వం, ముందస్తు మార్కెట్ సంకేతాలు రైతులకు అందించాలన్నారు. ఒకే రకమైన తేమ ప్రమాణాలు, ప్రామాణిక మాయిశ్చర్ మీటర్లు, పారదర్శక మార్కెట్ వ్యవస్థ అమలు చేయాలని సూచించారు.

అధిక కర్క్యూమిన్ రకాలపై దృష్టి

RARE అగ్రి విజన్‌లో భాగంగా అధిక కర్క్యూమిన్ రకాలను రైతులకు అందించడం, నాణ్యమైన టెస్టింగ్ ల్యాబ్‌ల ఏర్పాటు ద్వారా ప్రపంచ ప్రమాణాలకు తగ్గ పసుపు ఉత్పత్తి సాధ్యమవుతుందని మంత్రి తెలిపారు. అప్పుడు మాత్రమే తెలంగాణ పసుపు గ్లోబల్ మార్కెట్లలో స్థిరంగా నిలబడుతుందన్నారు.

అంతరపంటలతో తక్కువ రిస్క్ – ఎక్కువ ఆదాయం

ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్‌లో పసుపును భాగం చేయాలని సూచించిన మంత్రి, ఆయిల్ పామ్ వంటి పంటల్లో చెట్ల మధ్య ఖాళీ ప్రదేశాల్లో పసుపు వంటి స్పైస్ పంటలను అంతరపంటలుగా సాగు చేస్తే రైతులకు తక్కువ రిస్క్‌తో అధిక ఆదాయం లభిస్తుందని తెలిపారు.

విలువ జోడింపే పసుపు భవిష్యత్

రైతులు ముడి పసుపును మాత్రమే విక్రయించకుండా, విలువ జోడింపుపై దృష్టి పెట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. పసుపు భవిష్యత్ ముడి పంటలో కాకుండా, ప్రాసెసింగ్, న్యూట్రాస్యూటికల్స్, ఇమ్యునిటీ ఉత్పత్తులు, కాస్మోటిక్స్, కర్క్యూమిన్ ఎక్స్‌ట్రాక్షన్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల్లోనే ఉందని స్పష్టం చేశారు. ఇలా చేస్తే డిమాండ్ పెరిగి రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.

పలువురు ప్రముఖుల పాల్గొనడం

ఈ సమ్మిట్‌లో నేషనల్ టర్మరిక్ బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, టర్మరిక్ బోర్డు సెక్రటరీ భవానీ శ్రీ, CII తెలంగాణ చైర్మన్ శివ ప్రసాద్ రెడ్డి, అగ్రి యూనివర్సిటీ మాజీ వీసీ ప్రవీణ్ రావు, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గంగాధర్, సింథైట్ ఇండస్ట్రీస్ స్ట్రాటజిక్ సోర్సింగ్ హెడ్ జయశంకర్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.