ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానించిన భద్రాచలం ఆలయ ఈవో
కొత్తగూడెం లీగల్, డిసెంబర్: ఈ నెల 29, 30 తేదీల్లో భద్రాచలంలో ఘనంగా నిర్వహించనున్న ముక్కోటి ఏకాదశి మహోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్‌ను భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం కార్యనిర్వాహక అధికారి దామోదర్ రావు మంగళవారం ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం జిల్లా కోర్టులోని ప్రధాన న్యాయమూర్తి చాంబర్‌లో ఈవో దామోదర్ రావు, న్యాయమూర్తి పాటిల్ వసంత్‌కు అధికారిక ఆహ్వాన పత్రికను అందజేయగా, అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు.
అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ముక్కోటి ఏకాదశి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఆలయంలో చేపడుతున్న ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా భద్రాచలం ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.
భక్తులకు తాగునీరు, వసతి, వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణతో పాటు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను భక్తులు మెచ్చేలా ఘనంగా నిర్వహించాలని ఆయన తెలిపారు.

Post a Comment