ఐఐఎం మంజూరు చేయాలి: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
న్యూఢిల్లీ, డిసెంబర్ 16: హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్లమెంట్‌లోని ఛాంబర్‌లో కేంద్ర మంత్రితో భేటీ అయిన సీఎం, తెలంగాణకు ఐఐఎం అవసరాన్ని స్పష్టంగా వివరించారు.
టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో హైదరాబాద్ దేశంలో ముందంజలో ఉందని పేర్కొన్న సీఎం, ఇలాంటి నగరంలో ఐఐఎం ఏర్పాటు చేయడం సముచితమని తెలిపారు.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 19 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కలిపి 21 ఐఐఎంలు ఉన్నాయని, కానీ తెలంగాణలో మాత్రం ఒక్క ఐఐఎం కూడా లేదని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
200 ఎకరాల భూమి సిద్ధం
ఐఐఎం ఏర్పాటుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంగణంలో 200 ఎకరాల భూమిని గుర్తించినట్లు సీఎం తెలిపారు. ఐఐఎం తరగతులు వెంటనే ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. అవసరమైన అనుమతులు వెంటనే మంజూరు చేస్తే, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌కు అనుకూలతలు
హైదరాబాద్‌కు ఎయిర్, రైల్, రోడ్ కనెక్టివిటీ అద్భుతంగా ఉందని, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి సులభంగా చేరుకునే అవకాశాలు ఉన్నాయని సీఎం వివరించారు. అనుకూల వాతావరణం, వివిధ రంగాల్లో నిపుణులను అందించిన చరిత్ర హైదరాబాద్‌కు ఉందని తెలిపారు.
కేంద్రీయ, నవోదయ విద్యాలయాలపై విజ్ఞప్తి
తెలంగాణలో జిల్లాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో కొత్తగా 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని కూడా సీఎం కోరారు. పట్టణీకరణ పెరుగుతున్న తరుణంలో గ్రామీణ, పట్టణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇవి అత్యవసరమని తెలిపారు.
కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, వికారాబాద్, నిర్మల్ జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే హనుమకొండ, జనగాం, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు.
విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూమి, మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సీఎం వెంట ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

Post a Comment