జమాత్ ఇస్లామీ హింద్ – గోదావరిఖని యూనిట్ మహిళా విభాగం సదస్సు
“పొరుగిల్లు.. పోరు కోసం కాదు!” – కరుణ, సహనం విలువలపై అవగాహన
గోదావరిఖని, డిసెంబర్: జమాత్ ఇ ఇస్లామీ హింద్ (JIH) గోదావరిఖని యూనిట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో 8 ఇంక్లైన్ కాలనీలోని JIH లైబ్రరీలో మహిళా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయేషా సిద్దిక్వా (శిక్షణ కార్యదర్శి) మరియు టెమ్రీస్ కౌన్సలర్, 8 ఇంక్లైన్ కాలనీ మహిళా విభాగం ఇన్‌ఛార్జ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా “పొరుగిల్లు.. పోరు కోసం కాదు!” అనే అంశంపై హృదయాన్ని తాకే సందేశాన్ని వారు అందించారు. పొరుగువారు కేవలం చిరునామాలు కాదని, మన జీవితాల్లో వారు ఒక బాధ్యత, ఒక సంబంధమని వివరించారు. ఈ భావనను తన జీవితాంతం ఆచరించిన మహానుభావుడు ఇమామ్ అబూ హనీఫా జీవితాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు.
ఇమామ్ అబూ హనీఫా జీవితం ఆధ్యాత్మికత, సహనం, కరుణలకు ప్రతీక అని వారు వివరించారు. అర్ధరాత్రి తహజ్జుద్ నమాజులో లీనమై ఉండే ఇమామ్ పక్కనే నివసించే పొరుగువాడు మద్యం మత్తులో పాటలు పాడుతూ కలిగించే అవాంతరాలను కూడా ఓర్పుతో భరించిన తీరు సదస్సులో విశేషంగా ఆకట్టుకుంది. ఒక రోజు ఆ పొరుగువాడు జైలుకు వెళ్లినప్పుడు, అతని కోసం స్వయంగా జైలుకు వెళ్లి విడుదల చేయించటం ఇమామ్ అబూ హనీఫా మానవత్వాన్ని చాటిచెప్పే సంఘటనగా వక్తలు వివరించారు.
“ద్వేషం కాదు, నింద కాదు… కేవలం కరుణ మాత్రమే మనిషిని మారుస్తుంది” అనే సందేశం ఈ కథ ద్వారా స్పష్టమవుతుందని వారు పేర్కొన్నారు. ఆ ఒక్క మంచి మాట, ఆ ప్రేమతో కూడిన స్పర్శ ఒక తప్పుదారి పట్టిన మనిషిని మార్పు దిశగా నడిపించిందని తెలిపారు.
ఈ సదస్సులో నస్రీన్, హఫీజా, జరీనా, ఫర్హా, చాంద్‌బీ, ఫౌజియా, వసీమ్‌తో పాటు మహిళా విభాగానికి చెందిన సభ్యులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Post a Comment