కాలం సాక్షిగా జీవితం కరిగిపోతుంది: షేక్ అబ్దుల్ బాసిత్
చుంచుపల్లి మండలం – రుద్రంపూర్: కాలాన్ని సద్వినియోగం చేసుకునే వారే జీవితాన్ని సార్థకం చేసుకుంటారని జమాతే ఇస్లామి హింద్ రుద్రంపూర్–రామవరం శాఖ సభ్యుడు షేక్ అబ్దుల్ బాసిత్ అన్నారు. పవిత్ర శుక్రవారం ప్రత్యేక నమాజ్ సందర్భంగా రుద్రంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మస్జిద్-ఎ-ఖుబా లో ఆయన ధార్మిక ప్రసంగం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఈ భూమిపై అందరికీ సమానంగా లభించేది కాలం మాత్రమే. దానిని ఎలా వినియోగిస్తున్నామనే దానిపైనే మన జీవితం ఆధారపడుతుంది. జీవితం శాశ్వతం కాదు. ఏ క్షణంలో గడువు ముగిసిపోతుందో మనకు తెలియదు. కాబట్టి ప్రతి క్షణాన్ని మంచి పనులకు, సమాజహితానికి వినియోగించాలి,” అని ఆయన పేర్కొన్నారు.
అధర్మం, అన్యాయం, వ్యర్థ కార్యాలలో కాలం వృథా చేస్తున్నవారు మరణానంతరం శిక్షలకు గురయ్యే పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు. సన్మార్గంలో నడవడం, పరులకు ఉపయోగపడే పనులు చేయడం ముస్లింల ప్రాథమిక ధర్మమని చెప్పారు. ఈ కార్యక్రమంలో షమీం, మదార్, సోను బాయ్, తాజుద్దీన్, షబ్బీర్, రఫీ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment