తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలి

తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు వినతి


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కళాకారులకు న్యాయం చేయాలని తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం సభ్యులు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ కాలంలో పాటలు, నాటకాలు, కళా ప్రదర్శనల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన కళాకారులకు తెలంగాణ సాంస్కృతి సారధిలో ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేయాలని వారు కోరారు.

ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా ఇప్పటి వరకు ఒక్కరికీ కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో తమ జీవితాలను అంకితం చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్పందించిన కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ కళాకారుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలను, భవిష్యత్తును త్యాగం చేసిన కళాకారుల కోసం ఫోరంగా ఏర్పడి పోరాటం చేస్తున్న ఉద్యమ కళాకారులకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ రావడానికి ప్రధాన పాత్ర పోషించిన కళాకారులకు అండగా నిలబడటం తమ బాధ్యత అని ఆమె తెలిపారు.

కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, ఇందిరా పార్క్ వద్ద ఉద్యమ కళాకారులు చేపట్టే ధర్నాలో తెలంగాణ జాగృతి పాల్గొంటుందని కవిత గారు ప్రకటించారు. ఉద్యమ కళాకారులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.