జాతరలో బడా బాబుల దౌర్జన్యం చిరు వ్యాపారుల పొట్టకొడుతున్న బిల్డింగ్ యజమానులు
గద్వాల: గద్వాల పట్టణంలోని భీంనగర్‌లో వెలసిన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే జాతర ఈసారి వివాదాల మధ్య సాగుతోంది. భక్తిశ్రద్ధలతో జరగాల్సిన ఉత్సవాల్లో కొందరు భవన యజమానుల పెత్తనం పేద చిరు వ్యాపారుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీని విస్మరించి, అంగళ్లు ఏర్పాటు చేసుకోనివ్వబోమని భవన యజమానులు అడ్డుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఏళ్లనాటి ఆనవాయితీకి గండి
ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో పది రోజుల పాటు ఇక్కడ చిన్నపాటి జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఈ జాతరను నమ్ముకుని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అనేక మంది పేద చిరు వ్యాపారులు అంగళ్లు వేసుకుని జీవనోపాధి పొందుతుంటారు. అయితే ఈ ఏడాది భవన యజమానులు తమ షాపుల ముందు, ఖాళీ ప్రదేశాల్లో అంగళ్లు వేయనివ్వబోమని పట్టుబట్టడంతో వ్యాపారులు సామగ్రితో రోడ్డున పడాల్సి వచ్చింది.
వ్యాపారుల ఆవేదన
“ఏళ్ల తరబడి ఇక్కడే వ్యాపారం చేస్తున్నాం. పది రోజుల జాతరే మా కుటుంబాలకు ఆధారం. ఇప్పుడు కనికరం లేకుండా తరిమేస్తున్నారు. జాతరే జరగకుండా చేయాలనే కుట్రలా ఉంది” అంటూ చిరు వ్యాపారులు లబోదిబోమంటున్నారు.
అధికారుల జోక్యం అవసరం
వ్యాపారులను అడ్డుకుంటున్న తీరుపై భక్తులు, స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తి ప్రపత్తులతో జరిగే ఉత్సవాల్లో ఇలాంటి అడ్డంకులు సృష్టించడం సరికాదని వారు మండిపడుతున్నారు. వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు జోక్యం చేసుకుని, పేద వ్యాపారులకు న్యాయం చేసి జాతర ప్రశాంతంగా సాగేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Post a Comment