ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో దారుణం డిగ్రీ విద్యార్థినిని చితకబాదిన వార్డెన్

ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో దారుణం డిగ్రీ విద్యార్థినిని చితకబాదిన వార్డెన్

జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 29 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. హాస్టల్‌లో నివసిస్తున్న డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని వార్డెన్ భవాని కర్రలు, చేతులతో విచక్షణారహితంగా చితకబాదిన ఘటన ఆలస్యంగా బయటపడింది.

గత నెల నవంబర్ 24వ తేదీన ఈ ఘటన చోటుచేసుకోగా, భయభ్రాంతులకు గురైన విద్యార్థినులు మౌనంగా ఉండటంతో విషయం ఇన్నాళ్లూ బయటకు రాలేదు. అయితే తాజాగా తోటి విద్యార్థినులు మొబైల్ ఫోన్‌లో వీడియో చిత్రీకరించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

కారణం తెలియకపోయినా.. హింస మాత్రం తీవ్రం

విద్యార్థినిపై ఎందుకు దాడి చేశారనే విషయం ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, చిన్న తప్పిదాన్ని కారణంగా చూపుతూ వార్డెన్ భవాని తీవ్ర స్థాయిలో కొట్టినట్లు సమాచారం. కర్రతో పాటు చేతులతో ముఖం, చేతులు, వీపు మీద దాడి చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దాడి సమయంలో విద్యార్థిని తీవ్రంగా ఏడుస్తూ వేడుకున్నా, వార్డెన్ కనికరం చూపలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

వీడియోలు వైరల్.. పెరుగుతున్న ఆగ్రహం

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థినుల భద్రతే ప్రశ్నార్థకంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముందే వివాదాల్లో హాస్టల్

గమనార్హంగా, ఇదే ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో రెండు నెలల క్రితం విద్యార్థినులకు మత బోధనలు చేస్తున్నారనే ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. అప్పట్లో స్వల్ప విచారణకే పరిమితమైన అధికారులు, ఇప్పుడు జరిగిన ఈ హింసాత్మక ఘటనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని, వార్డెన్ భవానిపై తక్షణమే సస్పెన్షన్, క్రిమినల్ కేసు నమోదు చేయాలని దళిత, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే హాస్టల్‌లలో సీసీ కెమెరాలు, పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు, ఎస్సీ సంక్షేమ శాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.