ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ దశలవారీ పోరాటాలు
సదాశివపేట: 1925లో ఎం.ఎన్.రాయ్, అబ్బనీ ముఖర్జీ, ఎస్.ఏ.డాంగే, మొహమ్మద్ అలీ, ముజాఫర్ అహ్మద్, బి.టి.రాయ్‌లచే స్థాపితమైన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) భారత రాజకీయ చరిత్రలో ఒక కీలకమైన స్థంభమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి. ప్రకాష్ రావు అన్నారు. బ్రిటిష్ పాలనలో పేదలు, కార్మికులు, రైతులు ఎదుర్కొన్న అన్యాయాలకు ఎదురు నిలిచిన పార్టీగా సిపిఐ అవతరించిందన్నారు.
శుక్రవారం సదాశివపేటలో సిపిఐ పార్టీ వందేళ్ల వేడుకల సందర్భంగా వి. ప్రకాష్ రావు పార్టీ నాయకులతో కలిసి సిపిఐ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలోద్దీన్‌తో కలిసి ఆయన మాట్లాడారు.
స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో కార్మిక ఉద్యమాలు, రైతు సంఘాలు, ప్రజా ఉద్యమాల ద్వారా సిపిఐ ప్రజల్లో చైతన్యం నింపిందన్నారు. స్వాతంత్ర్యానంతరం కూడా భూమి సంస్కరణలు, కార్మిక హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పార్టీ నిరంతరం పోరాటాలు సాగించిందని తెలిపారు.
జైళ్ల పాలవ్వడం, నిషేధాలను ఎదుర్కొన్నప్పటికీ పార్టీ ఎప్పుడూ వెనుకడుగు వేయలేదన్నారు. ప్రజా నాట్య మండలి వంటి సాంస్కృతిక ఉద్యమాల ద్వారా ప్రజల కళను ఆయుధంగా మార్చి, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిందని పేర్కొన్నారు.
వందేళ్లు పూర్తి చేసుకున్న సిపిఐ సమానత్వం, సామాజిక న్యాయం, సెక్యులరిజం లక్ష్యాలతో ముందుకు సాగుతోందని తెలిపారు. ఎర్రజెండా కింద సాగిన ఈ శతాబ్దకాల పోరాటం భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు తాజోద్దీన్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రహమాన్, కార్యదర్శి వెంకట రాజ్యం, పాడి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజీవ రెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి, ఏఐటీయూసీ మండల కార్యదర్శి శంకరప్ప, నాయకులు సాధిక్ అలీ, ముస్తఫా, లడ్డు లక్ష్మి, జ్యోతి, వెంకట్ గౌడ్, శివలీలా, పూలమ్మ, యాదమ్మ, బిపాషా, దేవి, వినోద, నిర్మల, సఫియా తదితరులు పాల్గొన్నారు.

Post a Comment