గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను పరామర్శించిన కవిత
హైదరాబాద్/నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను, ఆమె కుటుంబ సభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కవిత గారు మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను చంపే స్థాయికి గంజాయి ముఠాలు తెగబడుతున్నాయంటే, రాష్ట్ర ప్రభుత్వంపై వారికి ఏమాత్రం భయం లేదని స్పష్టమవుతోందన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ నేడు గ్రామాలకూ గంజాయి, డ్రగ్స్ స్వేచ్ఛగా దొరికే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. స్కూళ్లలోకి కూడా గంజాయి, డ్రగ్స్ తీసుకొచ్చి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితుల వల్ల మహిళలే ఎక్కువగా బాధితులవుతున్నారని, కుటుంబాల్లో గృహహింస ఘటనలు పెరగడానికి కూడా డ్రగ్స్, గంజాయి ప్రధాన కారణమవుతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం “మత్తు” వదిలి, గంజాయి–డ్రగ్స్ మాఫియాపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే గంజాయి నిరోధక చర్యల్లో పాల్గొనే ఎక్సైజ్, ఫారెస్ట్ సిబ్బందికి ఆయుధాలు అందించాలని కోరారు. వారికి శిక్షణ సమయంలో గన్ ఫైరింగ్ నేర్పుతున్నారని, కానీ విధుల్లో ఆయుధాలు ఇవ్వడం లేదని తెలిపారు. సిబ్బంది వద్ద వెపన్స్ ఉంటే గంజాయి, డ్రగ్స్ మాఫియాకు కొంతైనా భయం ఏర్పడుతుందని కవిత గారు స్పష్టం చేశారు.

Post a Comment