నవ భారత్ మైనారిటీ రెసిడెన్సియల్ బాలికల పాఠశాలలో వాష్‌రూమ్‌ల ప్రారంభం
బూర్గంపహాడ్: నవ భారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ (పాల్వంచ) సంస్థ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాల్లో భాగంగా బూర్గంపహాడ్ మండలంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్సియల్ బాలికల పాఠశాలలో నూతనంగా నిర్మించిన వాష్‌రూమ్‌లను నేడు ప్రారంభించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బూర్గంపహాడ్ తహసీల్దార్ కె.ఆర్.కె.వి. ప్రసాద్ హాజరయ్యారు. ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.వి. గీతాజ్యోతి మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల కల్పనలో నవ భారత్ ఎనర్జీ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు.
ముఖ్య అతిథి తహసీల్దార్ కె.ఆర్.కె.వి. ప్రసాద్ మాట్లాడుతూ, నవ భారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వివిధ ప్రభుత్వ పాఠశాలలకు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం సంస్థ కల్పిస్తున్న సదుపాయాలు విద్యాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయని అన్నారు.
అనంతరం నవ భారత్ ఎనర్జీ లిమిటెడ్ హెడ్ – CSR సి.హెచ్. శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇప్పటివరకు సంస్థ చేపట్టిన పలు సామాజిక కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలకు సైన్స్ ప్రయోగశాలలు, ప్రయోగ పరికరాలు అందించడంతో పాటు, కంప్యూటర్ విద్య కోసం నైపుణ్యం గల ఉపాధ్యాయులను నియమించినట్లు తెలిపారు. అలాగే విద్యార్థులకు ఉచిత ట్యూషన్ సదుపాయం కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
ఇప్పటివరకు 39 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మరుగుదొడ్ల సదుపాయం లేక ఇబ్బందులు ఎదుర్కొనగా, వారికి వాష్‌రూమ్‌లు మరియు హ్యాండ్‌వాష్ ఫెసిలిటీస్ అందించినట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, విద్యాభివృద్ధే లక్ష్యంగా నవ భారత్ ఎనర్జీ ఎన్నో వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో లైజన్ ఆఫీసర్ ప్రసాద్, అసిస్టెంట్ మేనేజర్ (సివిల్) కరుణాకర్, CSR ఫ్యాకల్టీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment