కాకి గూటిలో కోకిల గుడ్లు… సింగరేణిలో అప్రెంటిస్‌ల పరిస్థితిపై HMS బహిరంగ లేఖ
సింగరేణి సంస్థలో అప్రెంటిస్‌గా చేరుతున్న యువతకు సాంకేతిక శిక్షణ ఇవ్వడం, నైపుణ్యాలను పెంపొందించడం, భవిష్యత్తులో మెరుగైన ఉపాధి అవకాశాలకు దారి చూపించడం ప్రధాన లక్ష్యంగా ఉండేది. ఒకప్పుడు సింగరేణి అప్రెంటిస్ చేసి వచ్చామని చెప్పుకుంటే పరిశ్రమల్లో ప్రత్యేక గౌరవం, ప్రాధాన్యత లభించేది. అయితే ఇటీవలి కాలంలో పరిస్థితులు మారిపోయాయని ఉద్యోగ వర్గాల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.
సాంకేతిక శిక్షణ ఎక్కడ? కూలీ పనులు మాత్రమే?
అప్రెంటిస్ పేరుతో యువతను తీసుకుంటున్నప్పటికీ, వారికి తగిన టెక్నికల్ శిక్షణ అందడం లేదని చాలా మంది యువకులు చెబుతున్నారు. యంత్రాల నిర్వహణ, మెషినరీ రిపేర్లు, సాంకేతిక ప్రక్రియలపై మార్గదర్శకత్వం ఇవ్వాల్సిన చోట మట్టిపని చేయించడం, పైపులు మోయించడం, చెట్లు పీకించడం, సాధారణ కూలీ పనులు లాంటి పనుల్లోనే ఎక్కువ సమయం గడుస్తోందని వారు పేర్కొంటున్నారు. దీంతో అప్రెంటిస్‌గా చేరిన యువత, “ఇదే సింగరేణి పని అయి ఉండాలి” అనే అపోహతో, నిజమైన శిక్షణకు దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
“అప్రెంటిస్ అంటే నైపుణ్యాభివృద్ధి” – ఉద్యోగ వర్గాల ఆవేదన
సింగరేణిలో అప్రెంటిస్ చేసి వచ్చామంటే ఒకప్పుడు ఇండస్ట్రియల్ సెక్టార్‌లో దాదాపు ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు సులభంగా దొరికేవి. కానీ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం లేకుండానే కాలం గడిపిన అప్రెంటిస్‌లు బయటకు వెళ్లిన తర్వాత సరైన అవకాశాలు పొందడంలో ఇబ్బందులు పడుతున్నారని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు.
అధికారుల స్పందనపై విమర్శలు
ఈ పరిస్థితులపై స్పందించాల్సిన కొంతమంది అధికారులు సమస్యలను పరిష్కరించే బదులు “అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి” అంటూ పెద్దగా పట్టించుకోకపోతున్నారని కొందరు కార్మికులు ఆరోపిస్తున్నారు. SOMలు, ప్రాజెక్ట్ ఆఫీసర్లు “ఘంటసాల ఒంటిగీతలు పాడుతున్నట్లుగా” విశేషాలు చెబుతున్నారని విమర్శిస్తున్నారు.
మార్పు అవసరం ఉందా?
వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని ఉద్యోగ సంఘాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా అప్రెంటిస్‌లకు నిజమైన టెక్నికల్ ట్రైనింగ్ వర్క్‌షాప్‌లలో ప్రాక్టికల్ శిక్షణ నైపుణ్య ఆధారిత పనుల కేటాయింపు శిక్షణ పద్ధతులపై సమీక్ష వంటి చర్యలు తీసుకుంటేనే “సింగరేణి అప్రెంటిస్” అనే పేరు మళ్లీ ప్రతిష్టను తెచ్చుకుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment