బంగారం లోన్ పేరిట రూ.10 లక్షల మోసం.. నిందితుడు అరెస్ట్
ఖైరతాబాద్, ఫిబ్రవరి 7 : బంగారం లోన్ తీర్చుతానని చెప్పి రూ.10 లక్షలకు పైగా మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బోరబండకు చెందిన వెంకటేశ్వర రావు అనే నిందితుడిని ఎస్ ఆర్ నగర్ పోలీసులు పట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వర రావు ఫేస్‌బుక్‌లో వచ్చిన గోల్డ్ లోన్ సంబంధిత ప్రకటనను చూసి సికింద్రాబాద్‌కు చెందిన ఓ బంగారం వ్యాపారిని సంప్రదించాడు. తనపై ఉన్న గోల్డ్ లోన్‌ను తీర్చాలని చెబుతూ రూ.10,37,000 లోన్ ఉందని చెప్పాడు. దీనికి నమ్మకం కలిగించేలా సదరు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు, డైరెక్టర్లను బ్యాంకుకు తీసుకెళ్లి లోన్ మొత్తాన్ని డిపాజిట్ చేయించాడు.
డబ్బులు డిపాజిట్ చేసిన అనంతరం ఇంట్లో చెక్కు ఉందని ఇస్తానని చెప్పిన వెంకటేశ్వర రావు, ఎగ్జిక్యూటివ్‌ను ఒక అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం సోమాజిగూడలోని బ్యాంక్‌లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకున్నాడు.
మోసపోయామని గుర్తించిన కంపెనీ డైరెక్టర్ ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి మొత్తం మోసపోయిన సొమ్మును రికవరీ చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment