ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె 4 లేబర్ కోడ్ల రద్దుకై కార్మిక సంఘాల పిలుపు

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె 4 లేబర్ కోడ్ల రద్దుకై కార్మిక సంఘాల పిలుపు


హైదరాబాద్ | ఫిబ్రవరి : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, దేశవ్యాప్తంగా 2026 ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు హింద్ మజ్దూర్ సభ (HMS) జాతీయ కార్యదర్శి, ఐక్య సంఘాల కార్మిక నేత ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ ప్రకటించారు.

కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కోట్లాది కార్మికులు, ఉద్యోగులు, రైతులు ఈ సమ్మెలో పాల్గొననున్నారని తెలిపారు. సింగరేణిని కాపాడటం, బొగ్గుబావులను రక్షించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.


కార్మికుల హక్కులపై దాడి

మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్ల పేరుతో గతంలో కార్మిక పోరాటాల ద్వారా సాధించుకున్న కీలక చట్టాలను రద్దు చేసిందని HMS నేతలు ఆరోపించారు. యూనియన్ ఏర్పాటు హక్కు, సమ్మె హక్కు, కనీస వేతనం, బోనస్, గ్రాట్యుటీ, ఈఎస్ఐ, ఈపీఎఫ్ వంటి మౌలిక హక్కులను కాలరాసే విధంగా ఈ కోడ్లు ఉన్నాయని తెలిపారు.


రద్దు చేసిన ముఖ్య కార్మిక చట్టాలు

4 లేబర్ కోడ్ల ద్వారా మొత్తం 29 కార్మిక చట్టాలను రద్దు చేశారని నాయకులు పేర్కొన్నారు. వాటిలో యూనియన్ హక్కుల చట్టం (1926), సమ్మె హక్కుల చట్టం (1947), కనీస వేతన చట్టం (1948), బోనస్ చట్టం (1965), గ్రాట్యుటీ చట్టం (1972), కాంట్రాక్ట్ లేబర్ చట్టం (1970), వర్కింగ్ జర్నలిస్ట్స్ చట్టం (1958), భవన నిర్మాణ కార్మికుల చట్టం (1996), అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత చట్టం (2008) తదితర కీలక చట్టాలు ఉన్నాయి.

ఈ చట్టాల రద్దుతో కార్మికులు పూర్తిగా కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.


సమ్మెను జయప్రదం చేయాలి

కార్మిక–రైతు–ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ సంఘాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఐక్యంగా ఈ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలంతా ఈ సార్వత్రిక సమ్మెకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.


మద్దతు తెలిపిన సంఘాలు

HMS, TSUS, AIFTU, IFTU, TNTUC, సంఘం నాయకులు రియాజ్ అహ్మద్, కామెర గట్టయ్య, మాతంగి రాయమల్లు, కె. విశ్వనాథ్, మణిరాంసింగ్, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.