భద్రాద్రి జిల్లాలో సాయంత్రం 5 గంటల వరకు 73.33% పోలింగ్ నమోదు

 

క్యూలో ఉన్న ప్రతి ఓటరికి ఓటు హక్కు వినియోగించే అవకాశం : జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 73.33 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లాలోని మూడు అర్బన్ లోకల్ బాడీల పరిధిలో మొత్తం 106 వార్డులకు గాను 288 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు పేర్కొన్నారు.

జిల్లాలో మొత్తం 1,85,348 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 88,738 మంది, మహిళలు 96,572 మంది, ఇతరులు 38 మంది ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు 1,35,910 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు.

మున్సిపాలిటీ వారీగా చూస్తే:

అశ్వరావుపేట మున్సిపాలిటీ: 16,850 మంది ఓటర్లలో 12,839 మంది (76.20%) ఓటు వేశారు.

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్: 1,34,775 మంది ఓటర్లలో 99,992 మంది (74.19%) ఓటు హక్కు వినియోగించారు.

యెల్లందు మున్సిపాలిటీ: 33,723 మంది ఓటర్లలో 23,079 మంది (68.44%) ఓటు వేశారు.

సాయంత్రం 5 గంటలకు పోలింగ్ సమయం ముగిసినప్పటికీ, అప్పటికే పోలింగ్ కేంద్రాల లోపల క్యూలో ఉన్న ప్రతి ఓటరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

పోలింగ్ పూర్తయిన వెంటనే బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సంబంధిత స్ట్రాంగ్ రూములకు తరలిస్తున్నామని, స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతర భద్రతా పర్యవేక్షణ కొనసాగుతుందని జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు.

Blogger ఆధారితం.