భద్రాద్రి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీలకు సంబంధించిన 2వ సాధారణ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లాలోని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్, అశ్వరావుపేట మరియు ఇల్లందు మున్సిపాలిటీల పరిధిలోని మొత్తం 106 వార్డులకు పోలింగ్ నిర్వహించబడిందన్నారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం సజావుగా కొనసాగిందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,85,348 మంది ఓటర్లలో 1,36,423 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో 73.60 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తెలిపారు. పురుష ఓటర్లలో 73.70 శాతం, మహిళా ఓటర్లలో 73.51 శాతం, ఇతర వర్గాల ఓటర్లలో 78.95 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. ప్రజలు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్య పట్ల ఉన్న చైతన్యానికి నిదర్శనమని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.
మున్సిపాలిటీ వారీగా పరిశీలిస్తే —
అశ్వరావుపేట మున్సిపాలిటీలో 16,830 మంది ఓటర్లలో 12,849 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 76.28 శాతం పోలింగ్ నమోదైంది.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1,34,775 మంది ఓటర్లలో 1,00,453 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 74.53 శాతం పోలింగ్ నమోదైంది.
ఇల్లందు మున్సిపాలిటీలో 33,723 మంది ఓటర్లలో 23,121 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 68.56 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.
పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిందని, పోలింగ్ ముగిసే సమయానికి కేంద్రాల వద్ద క్యూలో ఉన్న ప్రతి ఓటరికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించినట్లు పేర్కొన్నారు.
ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అధికార యంత్రాంగం, పోలీస్ సిబ్బంది, ఎన్నికల సిబ్బంది మరియు ప్రజలందరికీ జిల్లా ఎన్నికల అధికారి కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment