చెరువు సింగారం గ్రామంలో రోడ్డు దుస్థితి… ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్న ఆదివాసులు

చెరువు సింగారం గ్రామంలో రోడ్డు దుస్థితి… ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్న ఆదివాసులు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం: రోడ్డు సదుపాయం లేకపోవడంతో తమ ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆదివాసి గిరిజన గ్రామమైన చెరువు సింగారం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉందని వారు గగ్గోలు పెడుతున్నారు.

ఈ సమస్యను తెలుసుకున్న సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు రోడ్డును స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించి తమ బాధను వెల్లడించారు.

శంకుస్థాపనతోనే ఆగిపోయిన రోడ్డు పనులు

గతంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చెరువు సింగారం నుంచి నకిరిపేట–గోపాలపురం వెళ్లే రోడ్డుకు శంకుస్థాపన చేసి మెటల్ కంకర వేశారు. అయితే ఇప్పటివరకు బీటీ రోడ్డు గానీ, సీసీ రోడ్డు గానీ వేయకపోవడంతో రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారింది.

గ్రామాలు ఐటీడీఏ పరిధిలోకి వస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మారినా పరిస్థితి మారలేదని వారు అంటున్నారు.

గర్భిణులు, రోగులకు తీవ్ర ఇబ్బందులు

గ్రామంలో నిండు గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారు ఆస్పత్రికి వెళ్లాలంటే తీవ్ర ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు. చెరువు సింగారం–గోపాలపురం మధ్య రోడ్డు దుస్థితి కారణంగా అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా చేరలేని స్థితి ఏర్పడిందని తెలిపారు.

వెంటనే బీటీ రోడ్డు వేయాలని డిమాండ్

చెరువు సింగారం–గోపాలపురం రోడ్డుకు వెంటనే బీటీ రోడ్డు వేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం స్పందించకపోతే ఆదివాసి గిరిజనులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు చేపట్టేందుకు వెనుకాడబోమని బత్తుల వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సర్ప బాలరాజు, ఇరుకం రాజేష్, పొట్ట వసంతరావు, సర్ప రాజు, మల్కం కృష్ణ, పొడియం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.